బరువులు ఎత్తేవారు ఎక్కువకాలం జీవిస్తారా? కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

  • వారానికి 90-120 నిమిషాల వెయిట్ ట్రైనింగ్‌ చేయాలుంటున్న అధ్యయనం
  • అలా చేస్తే మరణ ప్రమాదం 13% తగ్గొచ్చు
  • గుండె జబ్బుల వల్ల మరణించే ప్రమాదం 19% తగ్గుతుంది
  • డిమెన్షియా వంటి నరాల వ్యాధుల ప్రమాదం 27% తగ్గినట్లు గుర్తింపు
  • వెయిట్ ట్రైనింగ్‌తో పాటు ఏరోబిక్‌ వ్యాయామాలు చేస్తే ఇంకా ప్రయోజనం
కండలు పెంచుకోవడానికి, ఫిట్‌గా కనిపించడానికి మాత్రమే వెయిట్ ట్రైనింగ్‌ ఉపయోగపడుతుందని చాలామంది భావిస్తారు. అయితే తాజా అధ్యయనం మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. క్రమం తప్పకుండా బరువులు ఎత్తే వ్యాయామాలు చేసే వారు ఎక్కువకాలం జీవించే అవకాశాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

అమెరికాలో దాదాపు 1.5 లక్షల మంది ఆరోగ్య సిబ్బంది, నర్సులపై 30 ఏళ్ల పాటు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. వారానికి 90 నుంచి 120 నిమిషాల పాటు వెయిట్ ట్రైనింగ్‌ చేసినవారిలో ఏ కారణంతోనైనా మరణించే ప్రమాదం 13 శాతం తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. గుండె సంబంధిత వ్యాధులతో మరణించే ప్రమాదం 19 శాతం, డిమెన్షియా వంటి నరాల సంబంధిత వ్యాధులతో మరణించే ప్రమాదం 27 శాతం తగ్గినట్లు గుర్తించారు.

అయితే రెండు గంటల కంటే ఎక్కువసేపు వెయిట్లు ఎత్తడం వల్ల అదనపు ప్రయోజనం కనిపించలేదని అధ్యయనం పేర్కొంది. మరోవైపు వారానికి కనీసం 150 నిమిషాల ఏరోబిక్‌ వ్యాయామాలు (నడక, జాగింగ్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌ వంటివి) చేసినవారిలో మరణ ప్రమాదం 26 నుంచి 43 శాతం వరకు తగ్గింది.

వెయిట్ ట్రైనింగ్‌తో పాటు ఏరోబిక్‌ వ్యాయామాలను కూడా కలిపి చేసినవారిలో అత్యధిక ప్రయోజనం కనిపించింది. ఈ రెండు రకాల వ్యాయామాలను సమతుల్యంగా పాటించినవారిలో మరణ ప్రమాదం దాదాపు 45 శాతం వరకు తగ్గినట్లు పరిశోధకులు వెల్లడించారు.

నిపుణుల ప్రకారం కండరాలు రక్తంలో ఉండే చక్కెరను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే రసాయనాలను విడుదల చేసి గుండె, మెదడు, రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అందుకే వారానికి రెండు సార్లు అయినా అన్ని ప్రధాన కండరాల సమూహాలకు వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.

Weight training
Longevity
Strength training benefits
Aerobic exercise
Heart disease prevention
Health study

More Telugu News